నవీన's image
9 min read

నవీన

Sri SriSri Sri
0 Bookmarks 393 Reads0 Likes

నవీన విశవిద్యాలయాల్లో
పురాణ కవితంలాగా
శ్రవణ యంత్రశాలల్లో
శాస్త్రీయ సంగీతం లాగా
ఇలా వచ్చేవేం వెన్నెలా?
ఎలా వర్ణించను నిన్ను?
మహా కవులు లోగడ చెప్పిందే
మళ్ళీ మళ్ళీ చెప్పాలా?
ఏదో కాస్త భాషా జ్ఞానం
ఇంతో అంతో చ్ఛందస్సంపదా
ఐదో పదో అలంకారాలు
ఆరో, అందులో సగం ఆవేశం

ఇలాంటివి ఏవో పోగుచేసి
ఇదివరకు నిన్నెప్పుడూ చూడనట్టు
ఇవాళే కొత్తగా కనిపెట్టినట్టు
ఏమని వర్ణించను నిన్ను?

ఏది రాసినా ఏం లాభం?
ఇదివర కెవడో అనే వుంటాడు
బహుశా ఆ అన్నదేదో నాకన్నా
బాగానే వుండొచ్చు.

అలాంటప్పుడు మళ్ళీ
కలం కాగితం మీద పెట్టి
కళంకం లేని తెల్లదనాన్ని
ఖరాయి చెయ్యడ మెందుకు?

అనాదీ నుంచీ నువు
అంత మంది కవులకీ
ఉపాదేయ వస్తువుగా నిలిచి
ఉపకారం చేశావు

అలాగే నేనూ ఒకప్పుడు
రొమాంటిక్ ప్రమాదంలో పడి
అమాయకంగా నీ బ్యూటీ
అభివర్ణించాను వృత్తాలలో

ఇవాళ మళ్ళీ అలాగ
ఎలాగ రాయగలను నేస్తం?
ఇరవయ్యో ఏడు నాకు మళ్ళీ
ఎలా వస్తుంది చెప్పూ?

అంచేత నీ గురించి
అనవసరవేశాలు పెంచి
అన్యాపదేశంగానో లేదా
అర్ధాంతరన్యాసంగానో

సొంత కోపాలేవో పెట్టుకుని
పంతాలూ పట్టింపులూ పట్టుకుని
ఎవరినీ ఈ వ్యవహారంలో
ఇరికించదలచుకోను నేను

ఇంతకీ ఆవేశాల కేముంది?
ఎవడి బతుకు వాడు బతుకున్నాడు

ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా
ఎంతగా పైపై భేదాలున్నా
ఎంతగా సాతిశయం పెరిగినా
ఎంత బలం ధనం జనం పెరిగినా
అంతరంగం అట్టడుగున మాత్రం
అంతమందిమీ మానవులమే!

అందుచేత ఓ చందమామా!
అందమైన ఓ పూర్ణ సోమా!
సముద్రం మీదా అరణ్యం మీదా
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!

(అదిగో మళ్ళీ కవితం-
అనుకున్నాను మొదటే నేను
వెన్నెల- పేరెత్తితే చాలు
వెర్రెత్తిపోయింది మనస్సు)

అన్నట్టి ఏమిటి చెప్మా
అందామని అనుకున్నాను
ఏమీలేదు;ఏమీ లేదనే
ఇంతసేపూ చెబుతున్నాను.

చెప్పొంచిదేమిటంటే
చెప్పడానికి కేమీ లేదని;
అంతమందికీ అన్నీ తెలుసు
అదే మన అజ్ఞానం

ఎవడో చెబితే వినే రోజులు
ఏనాడో వెళ్ళిపోయాయి
ఇంకా ఏదో చెప్పాలని
ఎందుకీ ఉబలాటం?

అసలు నిజం ఏమిటంటే
ఎవడికీ ఏమీ తెలియదు
ఇలా ఎందుకొచ్చామో
ఇక్కడెంత సేపుంటామో

ఇక్కడినుంచి వెళ్ళేదెక్కడికో
ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో
ఎవడూ చెప్పలేడంటే నమ్మండి
చెబితే మాత్రం నమ్మండి!

కాళ్ళక్రింద భూమి
కరిగిపోతున్నప్పుడు
పూరంవేసిన పునాదులు
కదిలిపోతున్నప్పుడు
మనిషికీ మనిషికీ మధ్య
మాయపొరలు కప్పినప్పుడు
మనసుకీ మనసుకీ మధ్య
మంచు తెరలు కమ్మినప్పుడు

ఏ నక్షత్రానికి తగిలించాలి
ఈ మన విషాద శకటాన్ని?
ఎవరు మళ్ళీ అతుకుతారు
ఈ విరిగిన జీవిత శకలాల్ని?

అంతా అగమ్యగోచరం
అంతా అరణ్య రోదనం
దేషం ఇచ్చే పర్సెంటేజీ
ప్రేమ ఎలా ఇవగలదు?

కష్టపడి అర్జించిన సాతంత్ర్యం
గద్దలు తన్నుకుపోతాయి
కంచిమేక పాపం ఎప్పుడూ
కసాయివాణ్ణే నమ్ముకుంటుంది.

ఇంతకీ ఈ భూమికి
ఏమాత్రం ఈడొచ్చిందని?
సగటు మానవుడి వయస్సు
పదకొండో, పన్నెండో!

ఈ కుర్రాళ్ళని చూసి
ఏందుకలా నవుకుంటావు
మబ్బుతునక జేబురుమాలు
మాటు చేసుకుని, జాబిల్లీ!

మానవుడు పెరుగుతున్నాడు
పరిసరాల నర్థం చేసుకుంటున్నాడు
ప్రకృతి శక్తులను జయిస్తూ
ఘనవిజయాలు సాధిస్తున్నాడు.

ఏదో నిరాశగా నేను
ఇంతసేపూ వాగాను కదూ?
ఇంకో వేపునుంచి చూస్తే
ఎంత వెలుగు కనబడుతుందో?

ఏమో బహుశా తరలో
మీ ఇంటికే రావచ్చు మేము
సాగతం ఇస్తావు కదూ
ఆతిథ్యాని కర్హులమే మేము

చంద్రమండలానికి ప్రయాణం
సాధించరాని సప్నంకాదు
గాలికన్న బరువైన వస్తువుని
నేలమీద పడకుండా నిలబెట్టలేదూ?

పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలూ
మహాకాశ వాతావరణంలోని
మర్మాలూ తెలుసుకున్నాక

సరాసరి నీదగ్గరకే
ఖరారుగా వస్తాంలే
అప్పుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావు కదూ నువు?

చిరకాలం అజేయంగావున్న
ఎవరెస్టు ఇటీవలే లొంగింది
చికిత్స లేదనుకున్న వ్యాధులు
చిత్తగిస్తున్నాయి పరారీ

పదార్థ విజ్ఞానశాస్త్రం
అమోఘంగా వికసిస్తోంది
ప్రాణం సభావం ఏమిటో
పరిశోధనలు సాగుతున్నాయి

మహానదుల గమనాలను
మళ్ళించ గలుగుతున్నాం
ఉత్తర ద్రువంలో వ్యవసాయం
ఒకప్పుడు జరిగి తీరుతుంది.

సంహారం సంగ్రామం అంటే
జనంలో అసహ్యం పుట్టింది
ప్రశాంతంగా జీవించాలని
ప్రజలంతా ఆశిస్తున్నారు.

ఇదీ మా భూలోకం కథ
ఇదీ మానవుడు Progress Report
ఇందులో అతిశయోక్తు లేమీ లేవని
ఎవరైనా ఒప్పుకుంటా రనుకుంటా.

అంతా బాగానేవుందని
అంతా సుఖంగానే ఉన్నారని
అన్నానంటే మాత్రం అది
అబద్ధమే అవుతుంది.

జనాభాలెక్కలు నాకు
సరీగా తెలియవుగాని
దరిద్రాల శాతం ఇంకా
చిరాకు కలిగిస్తూనే ఉంది.

ప్రపంచం మొత్తంమీద
భయం పెత్తనం చేస్తోంది
ఇరుగువాడు పొరుగువాణ్ణి చూసి
ఎందుకో బెదిరిపోతున్నాడు.

ఇక్కడ మా భారత వర్షంలో
ఎక్కువగా కబుర్లేగాని
సమాజ సరూపం మార్చే
సాహసం కనిపించకుండా వుంది.

మొన్ననే ఆంధ్రరాష్ట్రం
పుట్టినరోజు పండుగ చేసుకుంది
పన్నెండు నెలల అభ్యుదయం
పర్యాలోకనం చేసుకొంది.

ఏడాదిలో ఏమవుతుంది
ఇంకా కొన్నాళ్ళాగమంది
చెల్లాచెదలైన తెలుగువారంతా
తెల్లబోయి చూశారు!

ఇవన్నీ చెప్పకుంటూ
ఎందుకు నిన్ను విసిగించడం శశీ!
ఇప్పటికే ఆలస్యమయింది
ఇంతటితో విరమించినా?

చంద్రునికో నూలుపోగన్న
సామెత వుండనే వుంది
తీసుకో ఈ దారంలాంటి
తేలికైన గీతాన్ని.

ఇంతకుముందే చెప్పానుగా
ఏమీ పెగల్లేదని
ఇలాంటివెన్నో నువు
ఇదివరకు వినే వుంటావు.

శరత్కాల గగనంలో
చందమామ కనిపిస్తే
సరదాగా కొంతసేపు
సంభాషణ సాగించా.

సంతాపం కొంతసేపు
సంతోషం కొంతసేపు
సాగించిన సంభాషణలో
సారాంశం మరేముంది?

ప్రసంగవశాత్తూ ఏ
పగల్భాలు పలికానో
అసందర్భమైనా ఏ
అడ్డదారి తొక్కానో

వెనుక తిరిగి చూసుకొనే
అలవాటే లేదు నాకు
అరనిమిషం దాటేసరి
కదే నాకు గత శతాబ్ది.

కావున ఓ జాబిల్లీ!
రాబోయే యుగంలో
కాలక్షేపం చేద్దాం
కలుస్తావుగా మళ్ళీ?

అప్పుడు బహుశా నాలో
అరాజకం పోతుందనుకుంటా
ఇప్పుడు బాధిస్తూన్న
హృదయవేదన లుండవనుకుంటా

శాఖా చంక్రమణం మాని
చెప్పేదేదో సూటిగా
బల్ల గుద్దిన మాదిరిగ
కుండ బద్దలు కొట్టిన బావతుగా

ఈ నీళ్ళు నమలడం లేకుండా
ఈ కాళ్ళు తడబడడం లేకుండా
స్పష్టంగానే కాకుండా శ్రావ్యంగా
సచ్ఛంగానే కాకుండా సమగ్రంగా
రాబోయే యుగంలో

గుండెలు విప్పి మాటాడుకుందాం
మినహాయింపులు లేని క్షమాపణలులేని
సౌందర్యవంతమైన ఆ సర్ణయుగంలో

ఎంచేతనంటే భవిష్యత్తుమీదే
ఎప్పుడూ నా నిఘా వుంటుంది
ఇవాళకంటే రేపే
ఎంతో బాగుంటుందంటాను నేను.

వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
కవులను కదిలించడం అంటే
కాలం డొంకంతా అమాంతంగా
కదిలించడమే అవుతుంది.

సయంగా నీతో మాట్లాడి
చాలా కాలమయింది
అందుకే అవ్యక్తంగా అయినా
ఆప్యాయంగా మాట్లాడుతున్నాం.

ఎలాగైనా నువు మాకు
ఏకరక్త బంధువుడివి
నీతో కాకపోతే ఎవరితో
మా ఘోషలు చెప్పుకోవాలి?

వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
మనోహరమైన సంగీతం వినిపిస్తూ
ప్రయాణించు శశీ ప్రయాణించు.

ఇదిగో మాట! ఈ ప్రపంచంలో
ఇంకా ఎందరో అభాగ్యులున్నారు
పలకరించు వాళ్ళని చల్లగా
ధైర్యంచెప్పు వాళ్ళకి మెల్లిగా

ఆసుపత్రి కిటికీల్లోంచి నీ
కిరణాలను జాలుగా పంపించి
వ్యాధిగ్రస్థుల పాలిపోయిన కపోలాలను
జాలిగా స్పృ శించడం మరచిపోకు.

జైళ్ళలో వున్నారు కొందరు
వాళ్ళని ఓదార్పక తప్పదు సుమా
నేరాలు చేశారు నిజమే
అందుకని అలక్ష్యంగా చూడకేం!

మురికి గుడిసెల్లో నివసించే
పరమ దరిద్రుల నుదిటి మీద
ఏ కన్నంలోంచో జాగా చేసుకుని
ఎలాగైనా పరామర్శ చేస్తావు కదూ?

ఇదిగో జాబిల్లీ నువు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే.

No posts

Comments

No posts

No posts

No posts

No posts