ఎర్రశాలువ's image
2 min read

ఎర్రశాలువ

Sri SriSri Sri
0 Bookmarks 167 Reads0 Likes

ఎర్రశాలువ కప్పుకొని మా
ఇంటి కొచ్చిందొక రివాలర్
బాధలో బెంజైన్ సీసా
ప్రేమలో డైమన్ రాణి.
మెడకి కాంచనమాల చక్కని
జడకు చుట్టిన పుష్పవల్లి
చావుబతుకుల జమిలిదుప్పటి
కప్పు కొచ్చింది.

ప్రేమగానం మోసుకుంటూ
మహాశంఖం మాటలాడదు
ఐంద్రకార్ముక మంత్ర బర్హం
మబ్బుచాటున మాయమైనది:

పాత పీపా పీతపాపా
పాడుకుంటూ తిరుగుతాయట
కొత్త గొంతుక చెవిని పడితే
గుడ్లు నిప్పులు చెరుగుతాయట.

నేను వెళ్ళిన నాటినుంచీ
నీడలోపలి మేడ దిగదట
కోడిగ్రుడ్డు ప్రమాణకంగా
కృష్ణశాస్త్రిని చదవలేదట.

నన్ను తిట్టిన తిట్లతోనే
మల్లెపూవుల మాలకట్టెను
నాకు వ్రాసిన ప్రేమలేఖలు
పోస్టుచేయుట మానివేసెను.

వెయ్యిరాచ్చిప్పలని మేసిన
వెర్రికుక్కకి గాలివాన
రోలు చెప్పిన కథకి పాపం
డోలు కంచికి పైనమైనది.

ఓరి కూపస్థ భల్లూకం
గోడపై రుద్రాక్ష పిల్లీ
ఆటలోపల అరిటిపండు
పాట లెందుకురా.

ఎగురుతున్నాయ్ ఇనపకోటలు
పగులుతున్నాయ్ పాతపాటలు
రగులుతున్నాయ్ రాచబాటలు
రాజుకోవేరా.

ప్రేమకి సంఘానికీ ఒక
జారుముడితో చాలు పోరా
నిన్ను తిట్టేవాళ్ళకోసం
కళ్ళు విప్పుకు నిద్రపోరా.

ఇదే నా కడసారి సలహా
ఇలా తే నీ మనీపర్సుని
ఆంధ్రపత్రిక కప్పుకొని కా
రడవి కేగిం దా రివాలర్.

నేడు నా కంట్లో సివంగులె
నిద్రలో నిలిచే ఫిరంగులు
కాళ్ళ చుట్టూ కపాలాలే
కావ్యగీతీ కలాపాలు.

No posts

Comments

No posts

No posts

No posts

No posts